పానీ పూరి బండి వద్ద జరిగిన గొడవలో గాజు గ్లాసు పగిలి ఓ వ్యక్తి చేతికి తీవ్రగాయమైంది. ఆసుపత్రికి తరలించే లోపు ఏకధాటిగా రక్తం కారడంతో సదరు వ్యక్తి మృతి చెందిన ఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ ఎస్సై నాగేశ్వరరావు కథనం ప్రకారం… తుక్కుగూడకు చెందిన కట్టెల శ్రీనివాస్(28) బుధవారం రాత్రి పది గంటల ప్రాంతంలో మద్యం మత్తులో తన బైకుపై స్థానికంగా ఉన్న చౌరస్తాలోని పానీ పూరి బండి వద్దకు వెళ్లాడు. పానీపూరి ఇవ్వాలని అడగ్గా , అయిపోయిందని సదరు నిర్వాహకుడు చెప్పాడు. తనకే లేదని సమాధానం చెబుతావా అంటూ శ్రీనివాస్ అతనితో ఘర్షణ పడ్డాడు. ఇదేమిటని అక్కడే ఉన్న యాదయ్య అనే వ్యక్తి శ్రీనివాస్‌ను వారించాడు. మరింత కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ పానీపూరి బండిపై గట్టిగా బాదాడు.
దీంతో అక్కడ ఉన్న గాజు గ్లాసు పగిలి శ్రీనివాస్ కుడి చేతి నరానికి తగిలి తీవ్రగాయమైంది. గాజు ముక్కలు గాయంలో ఇరుక్కుపోవడంతో రక్తం ధారలా కారింది. గొడవ విషయం స్థానికులు పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి అతన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చాలా రక్తం పోవడంతో శ్రీనివాస్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.