నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్‌ సెంటర్‌లో దారుణం చోటుచేసుకుంది. వ్యాక్సిన్‌ వికటించి ఐదు నెలల చిన్నారి మృతిచెందగా.. మరో 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం నీలోఫర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్‌ సెంటర్‌లో బుధవారం ఉదయం దాదాపు 90 మంది చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. వీరంతా 3 నుంచి 5 నెలల వయసున్నవారే కావడం గమనార్హం. వ్యాక్సిన్‌ అనంతరం జ్వరం రాకుండా ఇవ్వాల్సిన మాత్రలు వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, వ్యాక్సిన్‌ వేయడం వల్ల ఇలా జరిగిందా? లేదా మాత్రల వల్ల జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. ఘటన అనంతరం చిన్నారులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. నీలోఫర్‌లో 15 మంది చికిత్స పొందుతున్నారు.