నీతులు చెప్పడం వేరు, ఆచరించి చూపడం వేరు. చెప్పింది చేసి చూపించాలి. లేకపోతే చెప్పకూడదు. తెలుగు భాష మాధుర్యం, స్వీట్ హాట్, మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అని చెబుతున్న నేతలు తమ పిల్లలను లక్షలు పోసి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకంటే అద్భుతంగా తీర్చిదిద్దామని చెబుతున్న నేతలు తమ వారసులను మాత్రం కార్పొరేట్ స్కూళ్లకే పంపుతున్నారు. అందుకే వారి మాటలను జనం పట్టించుకోవడం లేదు.

అయితే వీరికి బిన్నంగా ,తమిళనాడులోని తిరునల్వేలి జాల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న శిల్ప తన ముద్దుల కూతురుని అంగన్‌వాడి బడికి పంపుతోంది. ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజల్లో ఉన్న చిన్నచూపును తొలగించడానికి ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడి బళ్లు కూడా శుభ్రంగానే ఉంటున్నాయని, పిల్లలను పంపాలని ఆమె చెబుతున్నారు. ‘నా బిడ్డ కూడా అందరి పిల్లల్లాంటిదే. అందరితో కలిసిమెలసి ఉండాలని అంగన్‌వాడి సెంటర్‌కు పంపుతున్నాను.

నర్సరీ స్కూళ్లలో మాదిరే అక్కడా అన్ని సదుపాయాలూ ఉన్నాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలను ఆడిస్తారు, చదివిస్తారు. అంగన్‌వాడి సెంటర్లను మరింత అభివృద్ధి చేయాలి’ అని శిల్ప చెబుతున్నారు. ఆమె నిర్ణయాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు.