శ్రీవారి ఆలయ డ్రోన్ వీడియోపై టీటీడీ సీరియస్ అయింది. ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయంపై విమానాలు, డ్రోన్లు తిరిగేందుకు అనుమతి లేదన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేస్తోందని వైరలైన వీడియోలు త్రీడి యానిమేషన్ చేశారా? అన్న దానిపై ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నిర్ధారణ చేసుకుంటామన్నారు. అటు డ్రోన్ వీడియో తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు కోరారు.

క్రిమినల్‌ కేసులు పెడుతున్నాం:

శ్రీవారి ఆలయంపై భాగంలో గానీ, పరిసరాల్లో గానీ విమానాలు,‌ డ్రోన్ లు తిరిగేందుకు అనుమతులు లేవు ఆగమ సలహా‌మండలి సూచన మేరకూ ఆలయంపై విమానాలు, డ్రోన్ లు‌ నిషేధం ఉందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నిన్న సోషల్ మీడియాలో స్వామి వారి ఆలయం డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియో చక్కర్లు కొడుతుందని తెలిసిందని, టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిని గుర్తించడం జరిగిందని అన్నారు.

హైదరాబాదుకు చేందిన ఓ సంస్ధ డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోను పోస్టు చేసినట్లు నిర్ధారణకు వచ్చామని, సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై క్రిమినల్ కేసు పెడుతున్నామని చైర్మన్ స్పష్టం చేశారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల దర్యాప్తుకు ఆదేశించడం జరిగిందన్నారు. డ్రోన్ ద్వారా తీసిన చిత్రాల, స్టిల్ ఫోటో గ్రాఫర్ ద్వారా చిత్రీకరించిన వీడియోనా, లేక పాత చిత్రాలతో త్రిడీ లాగా రూపొందించారా ? అన్న దానిపై ఫోరెన్సిక్ ల్యాబ్ కి టెస్టింగ్ కోసం‌ పంపామని అన్నారు. రాబోయే నాలుగు, ఐదు రోజుల్లోనే దీనిపై ఓ క్లారీటీకి వస్తుందని, స్టిల్ కెమెరాతో ఫోటోలను మార్పింగ్ చేసి‌ చిత్రీకరించినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైందని, త్వరలోనే దీనిపై వాస్తవాలు వెలికి తీసి‌ భక్తుల ముందు ఉంచుతామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.