ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పుష్ప అనే యువతి, తనకు కాబోయే భర్త గొంతు కోసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతోనే కాబోయే భర్త గొంతు కోసినట్లు పుష్ప పోలీసుల ఎదుట అంగీకరించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి, విశాఖపట్నం జైలుకు తరలించారు. కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: అనకాపల్లి జిల్లాలోని మాడుగుల మండలం ఘాట్‌రోడ్డు జంక్షన్‌కు చెందిన అద్దెపల్లి రామునాయుడుకు, రావికమతం గ్రామానికి చెందిన పుష్పతో వివాహం నిశ్చయమైంది. మే 20న వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అత్తామామల ఆహ్వానం మేరకు రామునాయుడు సోమవారం రావికమతం వెళ్లాడు.

ఈ సమయంలో స్నేహితులకు పరిచయం చేస్తానని రామునాయుడిని తీసుకెళ్లిన పుష్ప మార్గమధ్యంలోని ఓ ఫ్యాన్సీ దుకాణం వద్ద గిఫ్ట్ అంటూ కత్తి కొనుగోలు చేసింది. ఆ తర్వాత వారిద్దరూ కోమళ్లపూడి శివారులోని అమరపురి ఆశ్రమం వద్దకు వెళ్లారు. అక్కడ ‘సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌’ ఇస్తానంటూ రాము కళ్లకు చున్నీతో గంతలు కట్టిన పుష్ప.. కత్తితో గొంతు కోసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ రామానాయుడు, షాక్ నుంచి తేరుకుని పుష్పను బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. ఆ సమయంలో పుష్ప ఏమైనా చేసుకుంటుందేమోనన్న అనుమానంతోనే ఆమెను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఈ క్రమంలో మరోవ్యక్తి సాయంతో ఎలాగోలా ఆసుపత్రికి చేరుకున్నాడు. ప్రస్తుతం రామునాయుడికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

దాడికి ముందు సెల్ఫీ:

ప్లాన్ ప్రకారమే రామానాయుడిపై పుష్ప దాడికి పాల్పడ్డప్పటికీ, అంతకుముందు వారిద్దరి మధ్య మంచి రిలేషనే ఉన్నట్లు కొన్ని ఫొటోలు చూస్తే తెలుస్తోంది. సర్ ప్రైజ్ అంటూ కత్తితో దాడి చేసే కంటే ముందు ఇద్దరూ కలిసి గతంలో నవ్వుతూ సెల్ఫీ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.