సారి… మీకు టికెట్లు లేవు : కేసీఆర్
ఉమ్మడి వరంగల్ జిల్లా తూర్పునియోజకవర్గం సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఈరోజు ప్రకటించి పార్టీ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు లేదు. వరంగల్ తూర్పు నియోజకవర్గం అబ్యర్థి పేరును పెండింగ్‌లో పెట్టినట్లు స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. దీంతో వరంగల్ జిల్లాల్ ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోఉన్న మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క తూర్పు స్థానాన్నే పెండింగ్ లో ఉంచారు కేసీఆర్. ఇప్పుడు ఈ విషయం జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు గాను తొలిజాబితాలో 105మంది పేర్లను ప్రకటించారు. ఇందులో ఆందోల్, చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాబుమోహన్, నల్లాల ఓదేలుకు టికెట్లు నిరాకరించారు. ఇక వరంగల్ తూర్పును మాత్రం పెండింగ్లో పెట్టడం గమనార్హం. అయితే,
ఈ విషయంలో ముందుముందు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. అయితే.. కొండా సురేఖ పేరును పెండింగ్‌లో పెట్టడానికి గల కారణాలేమిటనే దానిపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు. అయితే కొంత కాలంగా కొండా దంపతులు తిరిగి కాంగ్రెస్‌పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. అంతేగాకుండా, వచ్చే ఎన్నికల్లో తనతోపాటు తన కూతురు కూడా టికెట్ వస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గం టికెట్ వచ్చే ఎన్నికల్లో తమ కూతురుకేనని, స్పీకర్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ ఆమె బహిరంగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం రేపాయి.
కొద్దిరోజులుగా వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్‌కు, కొండా సురేఖకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
తూర్పు నియోజకవర్గంలో పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయి. దీంతో కొండా సురేఖ తీరుతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని ఇక్కడి నాయకులు స్వయంగా కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతేగాకుండా.. పార్టీ కార్యక్రమాల్లోనూ కొండా దంపతులు చురుగ్గా లేకపోవడం.. ఇదే సమయంలో అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారడంతో కేసీఆర్ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు ఆయన సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. తొలిజాబితాలో ప్రకటించకుండా పెండింగ్ పెట్టడంతో ఆమె అనుచరవర్గంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇది జిల్లా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.
News FIle: