సీమంతం ఆనందం గంటల్లో ఆవిరైంది.. తల్లీ కూతుళ్లు మృతి.

చిన్నప్పుడే తండ్రి ప్రేమకు దూరమైన కుమార్తెను అన్నీ తానై పెంచింది. ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేసింది. తన చిట్టితల్లి. తల్లి కాబోతోందని తెలిసి మురిసిపోయింది. పిల్లాపాపలతో నిండు నూరేళ్లు జీవించు తల్లీ అంటూ సీమంతం వేడుకలో తన బిడ్డను పెద్దలు దీవించడంతో ఉప్పొంగిపోయింది. మంగళవారం మంచిది కాదని బిడ్డను తీసుకుని సోమవారం అర్ధరాత్రి కారులో ఇంటికి ప్రయాణమైంది. ఆ కారే మృత్యుశకటమై తల్లీకూతుళ్ల ప్రాణాలను బలిగొంది. కడుపులో శిశువు ప్రాణం తల్లితో పాటే అనంతవాయువుల్లో కలిసిపోయింది.

యడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను కారు ఢీకొన్న ప్రమాదం ఆరుగురిని బలిగొంది. ఓ చిన్నారిని అనాథను చేసింది. మరొకరికి భార్యాబిడ్డలను దూరం చేసింది. మూడు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.