సుప్రీంకోర్టు బాంబు పేల్చింది
బాణసంచా విక్రయాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. పటాసుల అమ్మకాలపై నిషేధం విధించలేమని, అయితే విక్రయాలపై కొన్ని షరతులు వర్తిస్తాయని న్యాయస్థానం వెల్లడించింది. ఇక దీపావళి పండగ రోజున కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు పేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా బాణసంచా విక్రయాలపై కోర్టు నిషేధం విధించింది. దీపావళి పండగ అంటేనే టపాసుల మోత. అయితే ఇలా పెద్దమొత్తంలో బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందని, దేశవ్యాప్తంగా వాటిపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొద్ది రోజుల్లో దీపావళి పండగ రానున్న నేపథ్యంలో , ఈ పిటిషన్లపై ఇటీవల విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. బాణసంచా విక్రయాలను పూర్తిగా నిషేధించడం కుదరదని, అయితే అమ్మకాలకు కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. తక్కువ ఉద్గారాలను విడుదల చేసే, పర్యావరణానికి హాని కలిగించని టపాసులను మాత్రమే విక్రయించాలని కోర్టు తేల్చి చెప్పింది.
అంతేగాక వీటి ధ్వని కూడా తక్కువ డెసిబెల్స్ ఉండాలని, లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే వీటిని అమ్మాలని ఆదేశించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈ-కామర్స్ పోర్టళ్లు, ఆన్‌లైన్ ద్వారా బాణసంచా విక్రయాలపై న్యాయస్థానం నిషేధం విధించింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి విక్రయాలు జరిపితే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ తీర్పు కేవలం దీపావళి పండగకు మాత్రమే కాదని, అన్ని మతాల పండగలు, శుభకార్యాలకు వర్తిస్తుందని సుప్పీంకోర్టు తెలిపింది.
దీంతో పాటు బాణసంచా పేల్చేందుకు సమయాన్ని కూడా న్యాయస్థానం నిర్దేశించింది. దీపావళి నాడు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చేందుకు అనుమతినిచ్చింది. ఇక క్రిస్మస్, నూతన సంవత్సరం నాడు అర్ధరాత్రి 11.55 నుంచి 12.30 గంటల మధ్య బాణసంచా కాల్చాలని స్పష్టం చేసింది. కమ్యూనిటీగా బాణసంచా పేల్చడాన్ని కేంద్రం ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోర్టు సూచించింది. అంతకుముందు గతేడాది బాణసంచా విక్రయాలపై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే.