భర్త చనిపోతే ఏడవకపోతే భార్య హంతకురాలవుతుందా ?
తన తప్పు లేకుండా ఐదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఓ వివాహితకు సుప్రీంకోర్టు విముక్తి కల్పించింది. అస్సోంకు చెందిన ఓ వివాహిత ఐదేళ్ల క్రితం భర్తను పోగొట్టుకుంది. ఆమె భర్త ఎలా చనిపోయాడో సరైన వివరాలు లేవు. కానీ ఆ సమయంలో అతని మృతదేహం పక్కన కూర్చున్న ఆమె కనీసం ఏడవలేదట. దాంతో విచారణ నిమిత్తం వచ్చిన పోలీసులు ఆమెను నిందితురాలు అనుకున్నారు. దాంతో ఆమెను అరెస్ట్ చేసి గువహాతి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.
అనుమానాస్పద స్థితిలో భర్త చనిపోయి ఉంటే కనీసం ఆమె ఏడవలేదని, అంటే కోపంతో చంపేసి ఉంటుందని భావించిన న్యాయస్థానం శిక్ష విధించింది. బాధితురాలి తరఫు బంధువులు ఈ కేసు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
నిజానిజాలు తెలుసుకోకుండా, కేసును సరిగ్గా విచారణ జరపకుండా ఆమెకు శిక్ష విధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు నారిమన్, నవీన్ సిన్హాలు బుధవారం తీర్పు వెలువరించారు. భర్త మృతదేహం పక్కన కూర్చుని ఏడవకపోతే ఆమెను హంతకురాలు అనుకోవడానికి వీల్లేదని తెలిపింది. సరైన ఆధారాలు లేని కారణంగా శిక్ష అనుభవిస్తున్న ఆమెను విడుదల చేయాలని తీర్పునిచ్చింది.