తాను పనిచేసే చోట ఓ మహిళ తనతో సెక్స్ చేయమని వేధిస్తోందంటూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. తనకు పెళ్లైందని, తనను వదిలేయాలని చెప్పినా ఆమె వినిపించుకోలేదని, తన కోరిక తీర్చకపోతే క్రిమినల్ కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడిందని ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. లైంగిక వేధింపులపై మహిళల #మీటూ ఉద్యమం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చర్చనీయంగా మారింది.

సచిన్ మిట్కారీ (38) అనే వ్యక్తి పర్భానిలో ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఆదివారం (అక్టోబర్ 14) రాత్రి అతడు పర్భాని – వస్మత్ రోడ్‌లోని తన ఇంట్లో సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సచిన్ మృతదేహాన్ని కిందకు దించారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో అతడు రాసిన ఓ లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు.

‘నాతో పనిచేస్తున్న ఓ మహిళ నన్ను శృంగారం చేయమని రోజూ వేధిస్తోంది. నాకు వివాహమైన విషయం కూడా ఆమెకు తెలుసు. అయినప్పటికీ నన్ను వేధిస్తోంది. ఆమెతో సెక్స్‌కు నిరాకరించడంతో బ్లాక్ మెయిల్ చేస్తోంది. తన మాట వినకపోతే క్రిమినల్ కేసు పెడతానని బెదిరిస్తోంది’ అంటూ సచిన్ తన లేఖలో పేర్కొన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సచిన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సచిన్ ఆరోపణలు చేసిన మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.