సెప్టింక్ ట్యాంక్‌లో పడి బాలుడు మృతి చెందిన ఘటన కాజీపేట డీజిల్‌ కాలనీలో చోటు చేసుకున్నది. కాజీపేట ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. మడికొండకు చెందిన ఐతెనాదం జోసెఫ్‌కు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు అనుక్‌పాల్(8). జోసెఫ్ కాజీపేటలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో ఇద్దరు కుమారులు జోయెల్‌పాల్, అనుక్‌పాల్ హోటల్ వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో పతంగి ఎగురవేస్తున్నారు.

ఈ క్రమంలో డీజిల్‌కాలనీలోని క్వార్టర్స్ నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్‌ను స్టోర్ చేసేందుకు పెద్ద సెప్టిక్ ట్యాంకును ఏడాది క్రితం నిర్మించి మ్యాన్‌హోల్స్ ఏర్పాటు చేశారు. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో అనుక్‌పాల్ పతంగి ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. ఉదయం నుంచి ఆడుకున్న బాలుడు సాయంత్రం విగతజీవిగా మారడంతో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.