గ్రామాల సమగ్ర వికాసం లక్ష్యంగా సెప్టెంబర్ 3 న నిర్వహించనున్న సదస్సు చారిత్రకంగా నిలిచి పోతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సెప్టెంబర్ 6 నుంచి అమలు చేయనున్న ‘ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ‘ పంచాయతీరాజ్ వ్యవస్థ లోనే కొత్త అధ్యాయానికి నాంది కానుందని పేర్కొన్నారు. ‘ 30 రోజుల ప్రణాళిక అమలుపై అన్ని స్థాయి ల్లోని అధికారులకు మార్గదర్శనం చేసేందుకు మంగళవారం నాడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు.

ఈ సమావేశం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (టీ.ఎస్.ఐ.ఆర్.డి) ఆవరణ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం పరిశీలించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, టీ.ఎస్.ఐ.ఆర్.డి సి.ఈ.వో పౌసుమిబసు, ఇతర అధికారులకు మంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, రాష్ట ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, డి.ఎఫ్.వొలు, జెడ్పీ సీఈవో లు, ఎంపీడీఓ లు, డి.ఎల్.పి.వోలు, ఎంపీ వోలు పాల్గొంటారని చెప్పారు. అందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.