సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపడం ప్రమాదకరం అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా జనాల్లో మార్పు రావడం లేదు. సొంత వాహనాలను నడిపేవారి గురించి మనం చెప్పలేం. కానీ ప్రజా రవాణ వ్యవస్థలో పని చేస్తున్న డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే ఎలాంటి దారుణాలు జరుగుతాయో అందరికి తెలిసిందే. కొండగట్టు లాంటి బస్సు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఓ కారణం. అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు.

Advertisement

తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్‌ ఫోన్‌ మాట్లాడుతూ బస్సు నడుపుతున్న సంఘటన ఒకటి వెలుగు చూసింది. వివరాలు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి నల్లగొండ వెళ్లే నార్కట్‌పల్లి డిపోకు చెందిన ఏపీ 21 జడ్‌ 208 ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ మైసయ్య ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తూ కెమరాకు చిక్కాడు. బస్సులో పదుల సంఖ్యలో ఉన్న ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి తన పాటికి తాను మొబైల్‌లో రియల్‌ ఎస్టెట్‌ వ్యాపారం గురించి చర్చిస్తూ బస్సు నడుపుతున్నాడు మైసయ్య.

మైసయ్య వైఖరికి బస్సులో ఉన్న ప్రయాణికులు హడలిపోయారు. ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. అయితే మైసయ్య ప్రవర్తన పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవరన్నా ప్రమాదం జరిగితే నీ ఇంటితో పాటు ప్రయాణికుల ఇళ్లు కూడా మునుగుతాయ్‌ జర భద్రం అంటూ కామెంట్‌ చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ ప్రకారం బైక్‌ నడుపుతూ మొబైల్‌ ఫోన్‌ మాట్లాడితే రూ. 2 వేలు జరిమానా విధిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు మరి ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం అంటున్నారు. ఈ సంఘటనపై నార్కట్‌ పల్లి డిపో మేనేజర్‌ స్పందించాల్సి ఉంది….