బోయినపల్లి(చొప్పదండి): పదోతరగతిలో మంచి జీపీఏతో పాసైన ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌ వాడొద్దని మందలించడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయినపల్లి మండలం విలాసాగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్‌ కథనం ప్రకారం: విలాసాగర్‌కు చెందిన శేఖర్‌–లావణ్య దంపతుల కూతురు పోలె శరణ్య (16), ఇటీవలే పదోతరగతిలో 8.3 జీపీఏతో పాసైంది. శనివారం సెల్‌ఫోన్‌ చూస్తుండగా శరణ్యను తండ్రి మందలించడంతో రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే పడుకుంది.

తెల్లారి చూసేసరికి శరణ్య కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో వెతుకుతుండగా సాయంత్రం ఓ బావిలో శరణ్య శవమై కనిపించింది. సెల్‌ఫోన్‌ వాడొద్దని మందలించినందుకు మనస్థాపం చెందిన శరణ్య మర్లపేట నుంచి విలాసాగర్‌ వెళ్లే దారిలోని ఓ వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణం చెందినట్లు తండ్రి శేఖర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌ పేర్కొన్నారు.