సైకిలుపై హెల్మెట్ లేదని. సైకిల్ పై ఓవర్ స్పీడ్ అని. 500 ఫైన్

నెత్తిన టోపీ ,చేతిలో లాఠీ ,ఉంటే కొంతమంది పోలీసులకు అహంకారం తెలకెక్కుతుందో ..? మెదడు మోకాళ్ళలోకి జారుతుందో తెలియదుకానీ .. సైకిల్ పై పోయే పేదవాడికి హెల్మెట్ లేదని ఫైన్ వేసాడు. పైగా ఓవర్ స్పీడ్ అంటూ మరో ఆరోపణ .

బైకుపై వేగంగా వెళ్లినా, హెల్మెట్‌ పెట్టుకోకపోయినా ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తారన్న విషయం మనకు తెలుసు. అయితే, సైకిల్‌పై వెళ్తూ ఈ నిబంధనలు అతిక్రమించినా జరిమానా వేశారు కేరళ పోలీసులు. ఆ రాష్ట్రంలోని కాసర్గోడ్‌ జిల్లాలో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది. జరిమానా కట్టాలంటూ పోలీసులు తన చేతిలో పెట్టిన చలానా కాగితాన్ని ఆ యువకుడు తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కసీమ్‌ అనే యువకుడు కేరళకు వలస వచ్చి ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కంబాలా ప్రాంతంలో జాతీయ రహదారి గుండా సైకిల్‌పై తాను పని చేస్తున్న చోటుకి వెళ్తున్న ఆయనను పోలీసులు ఆగాల్సిందిగా కోరారు. అనంతరం అతి వేగంగా వెళుతున్నావని, హెల్మెట్‌ కూడా లేదని రూ.2000 జరిమానా కట్టాలని అన్నారు.

అయితే, కసీమ్‌ కూలీగా పనిచేస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు చివరకు రూ.500 జరిమానా విధించారు. అంతేకాదు, ఆయన సైకిల్ టైర్లలోంచి గాలి కూడా తీసేశారు. ఆయనకు వారు రాసిచ్చిన చలాను కాగితాన్ని పరిశీలిస్తే అందులో ఓ ద్విచక్ర వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ నెంబరు ఉంది. ఆ ద్విచక్ర వాహనం ఒక మహిళదని తెలిసింది. కసీమ్‌ ఈ విషయాన్ని తెలుపుతూ చేసిన పోస్టు వైరల్‌ కావడంతో ఈ సమాచారం అధికారులకు చేరింది. పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ యువకుడు కేరళలో కార్మికుడిగా పని చేస్తూ రోజుకి రూ.400 సంపాదిస్తున్నాడు.