ఖమ్మం: ముగ్గురి నడుమచిన్నప్పడే మొదలైన స్నేహం కొనసాగుతుండగా ఎక్కడికై నా కలిసే వెళ్లివచ్చేవారు. ఇందులో ఓ స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలను కేక్‌ కట్‌ చేసి ఘనంగా జరుపుకున్నారు. రాత్రి పొద్దుపోయాక బిర్యానీ తినాలని అనిపించడంతో బైక్‌పై బయలుదేరారు. ఈక్రమంలో బైక్‌పై వేగంగా వెళ్తున్నట్లు తెలుస్తుండగా అదుపు తప్పడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగగా, శనివారం ఉదయం ఖమ్మం ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మేడేపల్లికి మృతదేహాలను తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఎప్పుడు కలిసి కనిపించే ముగ్గురిలో ఇద్దరు మృతి చెందడం, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ముదిగొండ మండలం మేడేపల్లికి చెందిన పోతునూక శివరామకృష్ణ(21), పగిళ్ల ఉదయ్‌కుమార్‌(21) డిగ్రీ ద్వితీయ సంవత్సరం ఖమ్మంలోని ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్నారు. వీరి స్నేహితుడు అదే గ్రామానికి చెందిన పొలగాని రవీందర్‌ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు శుక్రవారం సాయంత్రం ఊరి చివరి సాగర్‌ కాల్వ బ్రిడ్జి కేక్‌ కట్‌ చేసి వేడుక జరుపుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు అక్కడే గడిపిన వీరు బిర్యానీ తినాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో రవీందర్‌ బైక్‌పై ఉదయ్‌కుమార్‌, శివరామకృష్ణతో కలిసి ఖమ్మం బయలుదేరారు. ఈక్రమంలో వీరు వేగంగా వెళ్తున్నట్లు తెలియగా.. ఖమ్మంలోని చర్చి కాంపౌండ్‌ బ్రిడ్జిపై అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉదయ్‌, శివరామకృష్ట అక్కడికక్కడే మృతి చెందగా, రవీందర్‌ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు.