తల్లి, తండ్రి, పిల్లలు లేదా ఇతర కుటుంబసభ్యులు చనిపోయినప్పుడు ‘అయ్యో… వాళ్లకెంత కష్టం వచ్చిందో’ అంటూ మిగిలిన కుటుంబీకులో స్నేహితులో చుట్టుపక్కలవాళ్లో సానుభూతి చూపిస్తూ, వాళ్లు తిరిగి మామూలు మనుషులు అయ్యేవరకూ అన్ని విషయాల్లోనూ చేదోడువాదోడుగా ఉంటుంటారు. వాళ్ల బాధని అర్థం చేసుకుని వాళ్లు తేరుకోవడానికి కొంత వ్యవధి పడుతుంది అని సరిపెట్టుకుంటారు. అదే ఎవరికైనా స్నేహితులు మరణిస్తే మాత్రం పెద్దగా పట్టించుకోరు. కానీ నిజానికి ప్రాణస్నేహితుల మరణాన్ని దిగమింగుకోవడం అనేది చాలా కష్టం అంటున్నారు ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకులు. సోషల్‌మీడియా స్నేహాల్ని పక్కనబెడితే ప్రాణస్నేహితులకి ఆపద వచ్చినా, ప్రమాదవశాత్తూ మరణించినా ఆ దుఃఖాన్ని తట్టుకోవడం, దాన్నుంచి తేరుకోవడం ఆయా వ్యక్తులకి చాలా కష్టమని వాళ్ల అధ్యయనంలో తేలిందట.

నేటితరంలో చాలావరకూ స్నేహ సంబంధాలు వ్యాపారబంధాలుగానే మిగులుతున్నప్పటికీ, దగ్గరి స్నేహితుల మరణం మాత్రం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆ సమయంలో వాళ్లకి కొంత కౌన్సిలింగ్‌ కూడా అవసరమవుతుందనీ వాళ్లు చెబుతున్నారు. కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్లయినా ప్రాణస్నేహితుల్ని కోల్పోయినప్పుడు వాళ్లను అలాగే వదిలేయకుండా ఓదార్పుని అందించాల్సిన బాధ్యత కుటుంబసభ్యుల దేననీ అప్పుడే వాళ్లు తిరిగి మామూలు వ్యక్తులు అవుతారనీ గుర్తించాలి…