కిషన్‌పుర : హన్మకొండ-కాజీపేట ప్రధాన రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం పెట్రోల్‌పంపు సమీపంలో ఆర్‌టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ మధ్యలోకి వెళ్లింది. డ్రైవర్‌ సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పింది. కాకాజీకాలనీలోని వరంగల్‌-2 డిపో నుంచి కాలం చెల్లిన ఆర్‌టీసీ బస్సును మరో బస్సు సహాయంతో కరీంనగర్‌ జోనల్‌ వర్క్‌షాపునకు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాల వద్దకు రాగానే కాలం చెల్లిన బస్సు కమాన్‌పట్టి విరగడంతో అదుపు తప్పింది. వెంటనే డ్రైవర్‌ అప్రమత్తమై డివైడర్‌ మధ్యలోకి తీసుకెళ్లారు. దీంతో బస్సు అక్కడే ఆగిపోయింది. ఒకవేళ అలా కాకుండా డివైడర్‌ మధ్యలోకి బస్సును తీసుకెళ్లకపోతే ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనాలకు దూసుకెళ్లే అవకాశముండేదని డ్రైవర్‌ తెలిపారు. డివైడర్‌ మధ్యలో ఉన్న విద్యుత్తు స్తంభం కూలిపోయింది. ఘటన జరగడంతో ప్రధాన రహదారిపై అరగంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచాయి. విషయం తెలుసుకున్న హన్మకొండ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ట్రాఫిక్‌ ప్రత్యేక వాహనంతో బస్సును తరలించారు…