తెలంగాణ మంత్రులుగా పది మంది ఎమ్మెల్యేలు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. కేసీఆర్ ఆమోద ముద్ర వేసిన మంత్రివర్గ తొలి జాబితాలో ఎమ్మెల్యే హరీష్ రావు పేరు లేకపోవడంపై మీడియాలో భిన్న కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. హరీష్‌కు కేసీఆర్ ప్రాధాన్యం తగ్గించారని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తొలిసారిగా ఈ వార్తలపై ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. తాను ఇప్పుడే కాకుండా ఎన్నికల ముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగిందని, టీఆర్‌ఎస్ పార్టీలో తాను క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుడి లాంటి కార్యకర్తనని హరీష్ చెప్పారు.

పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది ఆదేశిస్తే అది తూచాతప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికే పదుల సార్లు చెప్పడం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలు, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ ఏర్పాటు చేశారని హరీష్ రావు తెలిపారు. కేసీఆర్ తనకు ఏ బాధ్యత అప్పగించినా కూడా నిర్వర్తిస్తానని, తనకు ఎలాంటి అసంతృప్తి లేదని ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు.