రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ టీచర్ మృతి చెందింది. హెల్మెట్ ఉన్నా కూడా మహిళా ప్రాణాలు దక్కకపోవటం బాధాకరం. కరీంనగర్ పట్టణంలోని అల్కాపురి కాలనీలో నివాసం ఉంటున్న బండ రజిత ఇల్లంతకుంట మండలం మోడల్ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రజిత ఉదయం తన స్కూటీపై వెళ్తూ పద్మనగర్‌లోని బైపాస్ రోడ్ ప్రక్కనున్న ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద తన వాహనాన్ని నిలిపే సమయంలో తన స్కూటీని రెడీమిక్స్ వాహనం అత్యంత వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రజిత అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ప్రమాద సమయంలో రజిత తలకు హెల్మెట్ ధరించి ఉన్నా ప్రాణాలు దక్కకపోవటం విషాదకరమైన విషయం.

రజిత స్వగ్రామం శంకరపట్నం మండలం గద్ద పాక గ్రామం కాగా మృతురాలి భర్త ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ దగ్గర అడ్వకేట్‌గా విధులు నిర్వహిస్తుండేవాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత 8 సంవత్సరాల క్రితం హార్ట్ ఎటాక్‌తో మరణించారు. భర్త హార్ట్ ఎటాక్‌‌తో చనిపోగా ఇప్పుడు తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.