సినీ నటుడు రాజశేఖర్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శంషాబాద్‌ పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్ పై రాజశేఖర్‌ వెళ్తున్న కారుకు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడి మూడు పల్టీలు కొట్టింది. అయితే కారులోని ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడంతో రాజశేఖర్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో రాజశేఖర్‌ ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆయన ఇంటికి చేరుకున్నారు.

Advertisement

తనకు ఎటువంటి గాయాలు కాలేదని.. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై రాజశేఖర్ మాట్లాడుతూ “మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి నా కారు దగ్గరకు వచ్చారు.

లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విండ్‌ షీల్డ్‌లో నుంచి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాను. అక్కడి నుంచి వారి కారులో ఇంటికి బయలుదేరాను. నాకు ఎటువంటి గాయాలు కాలేదు” అని అన్నారు.