నార్సింగిలో ఓ టాలీవుడ్ హీరో లవర్ డ్రగ్స్‌తో దొరకటంతో హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగిలో ఇద్దరు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు లావణ్య కాగా మరొకరు ఉనీత్ రెడ్డి. అయితే ఈ లావణ్య టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో ప్రియురాలుగా తేలింది. కాగా, ఈ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే లావణ్యను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నత చదవుల కోసం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన లావణ్య కోకాపేటలో ఉంటూ తనకు వచ్చిన మ్యూజిక్‌ను పిల్లలు నేర్పిస్తోంది. దాంతో పాటు సినిమాల్లో అవకాశాల కోసం కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా ఉనీత్ రెడ్డితో కలిసి నటించింది. పలు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేసింది. ఈ క్రమంలోనే జల్సాలకు అలవాటు పడిన లావణ్య ఉనీత్ రెడ్డితో పాటు ఇందిరతో కలిసి డ్రగ్స్‌ అమ్ముతున్నట్టు తేలింది. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొస్తున్న లావణ్య బ్యాచ్‌ ఒక్క గ్రామును రూ.6 వేలకు అమ్ముతున్నట్లుగా పోలీసులు తెలిపారు.

సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఓ టాలీవుడ్‌ హీరోకు పరిచయమైన లావణ్య అతనితో ప్రేమలో పడింది. కాగా లావణ్యకు సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో పరిచాయాలున్నట్టు పోలీసులు చెప్తున్నారు. లావణ్య మొబైల్‌తో పాటు, సోషల్‌మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్‌ను పోలీసులు పరిశీలించగా కీలక డేటా వెలుగు చూసింది. లావణ్య మొబైల్‌లో పలువురు సింగర్స్‌, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇదిలా ఉంటే 3 నెలల క్రితం వరలక్ష్మీ టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులోనూ లావణ్య పాత్ర ఉంది. అయితే, అప్పుడు దొరకకుండా లావణ్య తప్పించుకుంది. దీంతో అప్పటి నుంచే లావణ్యపై పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్‌ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ దొరికాయి. లావణ్యను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనిత్‌ రెడ్డి గోవా నుంచి తీసుకొచ్చి డ్రగ్స్‌ ఇచ్చినట్లుగా తెలిపింది. కాగా ఉనిత్‌ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.