గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించింది. గతనెల వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. సోమవారం నాటికి జీతాలు చెల్లిస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో జీతాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని కోర్టుకు విన్నవించింది. సోమవారం లోపు కార్మికులకు జీతాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పనిచేసిన సెప్టెంబర్‌ జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాల్చింది. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు జీతాలు నిలిపివేయడంతో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆర్టీసీ కార్మికులు సమ్మె ను విరమించాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం సూచించింది.

ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్‌ జీవో, టీజీవో సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరించింది.