టీఎస్‌పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్‌ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సిట్‌ ఎల్బీనగర్‌లోని ఓ లాడ్జిపై దృష్టి సారించింది. ఏఈ పరీక్ష జరగడానికి ముందురోజు రాత్రి నిందితులు అక్కడ బస చేయడం, మరికొందరు వచ్చి వారిని కలవడంతో వచ్చిన వారెవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కొత్తగా అరెస్టు చేసిన ముగ్గురినీ సిట్‌ అధికారులు గురువారం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు పోలీసు కస్టడీ పూర్తయిన తొమ్మిది మందినీ జైలుకు పంపారు. మరోపక్క గ్రూప్‌-1 పరీక్షలో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన 121 మంది జాబితాను కమిషన్‌ నుంచి సేకరించిన పోలీసులు వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించారు.

Advertisement

లాడ్జి నుంచే ఏఈ పరీక్షకు గత నెల ఆఖరి వారంలో ప్రవీణ్‌ కుమార్‌ నుంచి ఏఈ ప్రశ్నపత్రం అందుకున్న రేణుక, డాక్యాలు అభ్యర్థులైన నీలేశ్, గోపాల్‌లను మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే ఉంచి పరీక్షలకు సిద్ధం చేశారు. ఈ నెల 4 రాత్రి నీలేష్, గోపాల్, డాక్యాలతో పాటు అతడి సమీప బంధువు రాజేందర్‌ రెండు వాహనాలపై ఎల్బీనగర్‌కు వచ్చారు.
అక్కడి ఓ లాడ్జిలో బస చేశారు. మర్నాడు సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రంలో నీలేష్, గోపాల్‌తో పరీక్ష రాయించారు. అయితే వీళ్లు లాడ్జిలో ఉండగా కొందరు వచ్చి కలిసినట్లు సిట్‌ అధికారులకు ఆధారాలు లభించాయి. దీంతో వాళ్లు అభ్యర్థులేనా.? కొన్ని ప్రశ్నలు లేదా ప్రశ్నపత్రాన్ని నీలేష్, గోపాల్‌ వారితో పంచుకున్నారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. 9 మంది నిందితుల్ని మరో నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించిన 25 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత తేదీల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. విడతల వారీగా మొత్తం 121 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. టీఎస్‌పీఎస్సీ కస్టోడియన్‌ శంకరలక్ష్మిని మరోసారి విచారించాలని నిర్ణయించారు.
తెరపైకి రాజశేఖర్‌ బంధువు ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రెండో నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌ సమీప బంధువు ప్రశాంత్‌ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌లో నివసిస్తున్న ప్రశాంత్‌ గ్రూప్‌-1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. గతేడాది అక్టోబర్‌లో నగరానికి వచ్చి ప్రిలిమినరీ పరీక్ష రాసి వెళ్ళాడు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన ప్రశాంత్‌ 100కు పైగా మార్కులు పొందినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఇతడికి లీకైన గ్రూప్‌-1 పేపర్‌ అందిందా? అని అనుమానిస్తున్న సిట్‌ అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.