నాగోలు: కారు, ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండుగులు ఓ యువకుడిని అర్ధరాత్రి కిడ్నాప్‌ చేసిన సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు: గడ్డిఅన్నారం డివిజన్‌ పిఅండ్‌టి కాలనీకి చెందిన లంక సుబ్రహ్మణ్యం (24) గురువారం అర్ధరాత్రి శ్రవణ్, దినేష్‌ స్నేహితులతో మాట్లాడుతుండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వారు సుబ్రహ్మణ్యం తండ్రి గురించి వాకబు చేశారు. తన తండ్రి నిద్రపోతున్నాడని చెప్పాడు. చౌరస్తా వద్దకు రావాలని చెప్పడంతో శ్రవణ్, దినేశ్‌లు అక్కడికి వెళ్లారు. ఇంతలో కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు సుబ్రహ్మణ్యంను కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు.

ఈ విషయమై సుబ్రమణ్యం తండ్రి లంక లక్ష్మీనారాయణ సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా కిడ్నాప్‌ గురైన సుబ్రహ్మణ్యం నల్గొండ జిల్లా చింతపల్లిలో ఉన్నారనే సమాచారం మేరకు ఎస్‌ఓటి పోలీసులు అక్కడికి వెళ్లి సుబ్రహ్మణ్యం తో పాటు కిడ్నాప్‌ చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎస్‌ఓటి పోలీసుల అదుపులో ఉన్న వివరాలను సరూర్‌ నగర్‌ పోలీసులు వెల్లడించడం లేదు. కిడ్నాప్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.