ఓరుగల్లు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మాస్టర్‌ప్లాన్‌కు తుదిరూపునిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. పట్టణాల సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్లు దిక్సూచిలా పనిచేస్తాయని అన్నారు.

Advertisement

వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌ ముసాయిదా (డ్రాప్ట్‌ మాస్టర్‌ప్లాన్‌) పై కుడా పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో శనివారం హైదరాబాద్‌లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ కీలకమని, భవిష్యత్తు తరాలకు ఉపయోపడేలా, సమగ్ర అభివృద్ధి సాధించేలా ఇవి ఉండాలని సూచించారు. ఈ మాస్టర్‌ప్లాన్‌పై వివిధ వర్గాల నుంచి సుమారు నాలుగు వేల వరకు సూచనలు, సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు.

వీటన్నింటినీ క్రోడీకరించి డ్రాఫ్ట్‌ను తయారు చేసినట్లు చెప్పారు. 2041 సంవత్సరం వరకు అవసరాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించామని కేటీఆర్‌ తెలిపారు.