హయత్‌నగర్: నన్ను వెతకకండి, ఒకవేళ వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తకు ఫోన్‌లో మెసేజ్ పెట్టి ఓ వివాహిత అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూర్‌కు చెందిన తిరందాస్ ప్రసాద్‌కు ఆరేళ్ల క్రితం పూజతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు.
చిన్న తగాదాల కారణంగా రెండు వారాల క్రితం పూజ తన పుట్టింటికి వెళ్లింది. ఐదు రోజుల క్రితం భర్త ప్రసాద్ వెళ్లి రాజీ కుదుర్చుకుని ఇంటికి తీసుకొచ్చాడు. శుక్రవారం నాగోల్‌లోని తన అత్త ఇంటికి వెళుతున్నానని చెప్పి పూజ తన పిల్లలను తీసుకుని వెళ్లింది. తర్వాత తాను నీతో ఉండను నన్ను వెతక వద్దు, వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని తన మొబైల్ నుంచి భర్తకు వాయిస్ మెసేజ్ పెట్టింది. దీంతో ఆందోళనకు గురైన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.