వెంగళరావునగర్‌: గత కొంతకాలంగా ఓ యువతిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న యువకుడిపై మధురానగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు వివరాలు: గుంటూరు జిల్లాకు చెందిన యువతికి, అదే జిల్లాకు చెందిన గోపీ అనే యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. అదికాస్త ప్రేమకు దారితీసింది. తనకు ఉద్యోగం లేదని, నగరంలో ఉద్యోగం ఉంటే ఇప్పించాలని కోరాడు. దాంతో ఆమె తాను పని చేస్తున్న కనకనదుర్గా స్టీల్స్‌ కంపెనీలోనే ఉద్యోగం కూడా ఇప్పించింది. ఈ క్రమంలో ఇరువురు దగ్గరయ్యారు. అతనికి అనేకమార్లు వేలాదిరూపాయలు నగదును కూడా సహాయం చేసింది. అయితే కొంతకాలంగా గోపి మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో స్నేహంలో ఉన్నాడు.

ఈ విషయాన్ని గ్రహించిన ఫేస్‌బుక్‌ స్నేహితురాలు గోపీని దూరం చేసింది. తన వద్దకు రావద్దని, మాట్లాడవద్దని తిరస్కరిస్తూ వస్తుంది. దీనికి ఆగ్రహించిన గోపి తనతో గతంలో మాదిరిగా ఉండాలని, డబ్బులు ఇవ్వాలని, శారీరకంగా కలవాలని బెదిరించడం ప్రారంభించాడు. దీనికి ఒప్పుకోకుండా అతనిని ఆమె తిరస్కరించడంతో గతంలో ఇరువురు కలిసి ఉన్న ఫోటోలను ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించడంతో ఆమె శనివారం మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధురానగర్‌ పోలీసులు గోపీపై 354 (డి), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.