పనుల్లో జాప్యం- అధికారులపై సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ ఆగ్రహం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్, అన్నారం బరాజ్‌ను, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడలో నిర్మిస్తున్న సుందిళ్ల పంప్‌హౌస్‌ను గురువారం ఆమె సందర్శించారు. మేడిగడ్డ బరాజ్ పరిధిలో పోచంపల్లి వైపున గల సైడ్‌బండ్స్ పనులను పరిశీలించారు. భూసేకరణలో జాప్యంపై అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇటీవల ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించినా భూసేకరణ పూర్తిచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అపై అధికారులు సైతం వారం రోజుల్లో పరిష్కరించి పనుల్లో వేగం పెంచుతామని తెలిపారు.

మార్చి నెలాఖరులోగా మేడిగడ్డ బరాజ్ పనులను పూర్తిచేయాలన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్ల బిగింపు ప్రక్రియను, కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి 13.2 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్ వెంట వాహనాల్లో ప్రయాణిస్తూ ఇతర పనులను పరిశీలించారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించొద్దని సూచించారు. అనంతరం అన్నారం బరాజ్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

స్మితాసబర్వాల్ వెంట సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, లిఫ్ట్‌ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, కలెక్టర్లు వాసం వెంకటేశ్వర్లు, శ్రీదేవసేన, సీఈ నల్లా వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు…