వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పాక్‌ అధికారులు భారత్‌కు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం అతడు భారత్‌కు రాగానే విచారణ చేయనున్నారు. అటారీ చేరుకున్న అభినందన్‌ను భారత వైమానిక దళానికి చెందిన ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆయన ఫిట్‌నెస్‌ స్థాయి ఏ మేరకు ఉందనే దాన్ని పరీక్షిస్తారు. అనంతరం ఆయన శరీరంలో పాక్‌ ఆర్మీ ఏమైనా బగ్‌ను అమర్చిందా? అనేది తెలుసుకునేందుకు స్కానింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అంతేకాదు.. ఆయన మానసిక పరిస్థితి, ఆలోచనా విధానం ఏ విధంగా ఉందో పరీక్షిస్తారు. అభినందన్‌ నుంచి సమాచారం రాబట్టేందుకు శత్రుదేశం అతడిని టార్చర్‌ చేసిందా? అనే విషయానికి సంబంధించి వివరాలను సేకరిస్తారు. ఇంకా ఏదైనా అవసరం అనిపిస్తే ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) అధికారులు ఆయన్ను ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. సాధారణంగా ఐఏఎఫ్‌ అధికారిని ఐబీ, రా అధికారులు విచారించేందుకు అనుమతి లేదు. కానీ, క్లిష్టమైన కొన్ని కేసుల్లోనే ఈ విధంగా విచారణ చేయాల్సి ఉంటుంది.