అమ్మ భాష కళ్లలాంటిదని ! ఇతర భాషలు కళ్లజోడులాంటివని !! ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పార్లమెంటులో తెలుగులో వ్యాఖ్యానించారు.

ప్రతిఒక్కరూ మాతృభాషను గౌరవించాలని దాని పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత మాతృభాష, తరవాత ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్లమెంటులో జరిగిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే రాజ్యాంగ విశిష్టతను వివరించారు. అససరానికి అనుగుణంగా మన రాజ్యాంగ ఔన్నత్యాన్ని పదిలపరచుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగా ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని 103సార్లు సవరించిన విషయాన్ని గుర్తుచేశారు.

సుదీర్ఘ మథనం ద్వారా అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారన్నారు. మన రాజకీయ ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యంగా ఉండాలని అంబేడ్కర్‌ ఆశించారన్నారు. పరిపాలనలోనూ అనేక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. మన పనులు, జీవితంలో సృజనాత్మకత భాగంగా ఉండాలన్నారు. దేశాన్ని మార్చడమన్నది ప్రతిఒక్కరి లక్ష్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి ఫలాలు ప్రతిఒక్కరికీ చేరాలని ఆకాంక్షించారు. అట్టడుగున ఉన్నవారికి తొలి ఫలాలు చేరాలన్నారు. దేశనిర్మాణంలో పౌరులంతా భాగం కావాలని పిలుపునిచ్చారు.