మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాపులర్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో పాల్గొన్నారు. దీని కోసం ఆయన న్యూయార్క్ వెళ్లారు. హైదరాబాద్ నుంచి అయ్యప్ప మాలలో వెళ్లిన రామ్ చరణ్ న్యూయార్క్‌లో సూటుబూటులో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. యూఎస్‌లో పాపులర్ టాక్ షో అయిన ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. RRR సినిమా తీసుకొచ్చిన గ్లోబల్ క్రేజ్‌తో ఈ పాపులర్ టాక్ షో నుంచి రాంచరణ్‌కు ఆహ్వానం అందింది. దీంతో ఆయన రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరి వెళ్లారు. న్యూయార్క్ వెళ్లడం కోసం మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన రామ్ చరణ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఎయిర్‌పోర్టు లోపలికి నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలను అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేశారు.

అయితే, న్యూయార్క్‌లో ఏబీసీ స్టూడియో దగ్గర రామ్ చరణ్ ఈరోజు సూటుబూటు వేసుకుని స్టైలిష్ లుక్‌లో కనిపించారు. గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొనడానికి ఏబీసీ స్టూడియోస్ దగ్గరకు వెళ్లిన చరణ్‌తో ఫొటోలు దిగడానికి అక్కడి అభిమానులు ఎగబడ్డారు. చరణ్‌తో కరచాలనం చేశారు, ఈ ఫొటోలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యూయార్క్‌లో సైతం రామ్ చరణ్ క్రేజ్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే, కొంత మంది సోషల్ మీడియాలో ఒక సందేహాన్ని వ్యక్తపరిచారు. హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ న్యూయార్క్‌లో సూటుబూటు ఎలా వేసుకున్నారు? అని కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. అయితే, ఆ ప్రశ్నలకు రామ్ చరణ్ పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో వెళ్లడం నిజమే. అయితే, న్యూయార్క్ వెళ్లిన తరవాత అక్కడ ఒక ఆలయంలో దీక్షను విరమించి మాల తీసేశారట. 21 రోజుల దీక్ష చేసిన చరణ్ ఆ రోజులు ముగియడంతో అక్కడ దీక్ష ముగించారట.

అందుకే, మరుసటి రోజు హుందాగా, స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ విషయం తెలియని చాలా మంది ఏవేవో ఊహించేసుకుంటున్నారు. కొంత మంది అయితే అయ్యప్ప దీక్ష 41 రోజులు ఉంటుంది కదా ఎంతో నిష్ఠతో చేసే దీక్షను మధ్యలో ఎలా విరమిస్తారు అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ, 21 రోజుల దీక్ష కూడా ఉందట. నిజానికి రామ్ చరణ్ ఏడాదిలో మూడు నాలుగు సార్లు అయ్యప్ప మాలను ధరిస్తారని సమాచారం. నిజం చెప్పాలంటే, ఆయన మీద ప్రస్తుతం కామెంట్లు చేసేవాళ్లకు బహుశా విషయం తెలియదేమో. లేదంటే, ఏడాదిలో మూడు నాలుగు సార్లు మాల వేసుకునే రామ్ చరణ్ అందులోని నియమ నిబంధనలు, సంప్రదాయాల గురించి తెలియకుండా ఉంటారా.? ఇక, గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షో విషయానికి వస్తే ఈ షోలో పాల్గొన్న తొలి సౌత్ ఇండియన్‌గా రామ్ చరణ్ నిలిచారు. ఈ షోలో పాల్గొనడంతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగినట్టయ్యింది. ముఖ్యంగా రామ్ చరణ్ రాకతో న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద సందడి వాతావరణం కనిపించింది. రామ్ చరణ్‌ను తమ కెమెరాల్లో బంధించేందుకు అక్కడి తెలుగు వారు ఎగబడ్డారు. అభిమానులు ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. అయితే, అందరితో కలిసి రామ్ చరణ్ ఒక సెల్ఫీని స్వయంగా తీసుకున్నారు. ఈ షోలో రామ్ చరణ్ చాలా బాగా మాట్లాడారని ప్రశంసలు వస్తున్నాయి.