నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోకి చెందిన నాగేశ్వర్ అనే కండక్టర్ బుధవారం మతి స్థిమితం కోల్పోయాడు. మంగళవారం అర్ధరాత్రితో ప్రభుత్వం కార్మికులకు విధించిన డెడ్ లైన్ ముగియడంతో తిరిగి తమను విధుల్లోకి తీసుకుంటారో తీసుకోరోనన్న తీవ్ర ఆందోళనతో మతి స్థిమితం కోల్పోయాడు. బుధవారం ఉన్నట్టుండి ఏదేదో మాట్లాడటం మొదలుపెట్టడంతో అతని భార్య ఆందోళన చెందింది.

చికిత్స కోసం హైదరాబాద్‌ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా సమ్మెలో ఉన్న ఉద్యోగులకు చికిత్స నిరాకరించారు. దీంతో ఏం చేయాలో తెలియక తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.
నాగేశ్వర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంగారెడ్డిలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సమ్మె కారణంగా జీతం డబ్బులు రాకపోవడంతో అద్దె చెల్లించడం, కుటుంబాన్ని పోషించడం భారమైపోయింది. కొద్దిరోజులుగా తీవ్ర ముభావంగా ఉంటున్న అతను.. ప్రభుత్వ డెడ్ లైన్ ముగియడంతో మరింత ఆందోళన చెందాడు. అప్పటినుంచి ‘డ్యూటీ’ అని నవ్వడం, ‘డిస్మిస్’ అని ఏడవడం చేస్తున్నాడు.

భర్త పరిస్థితి సరిగా లేకపోవడం ! మరోవైపు ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి తెస్తుండటంతో భర్త, పిల్లలను వెంటపెట్టుకుని అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. నాగేశ్వర్ లాగే ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కార్మికులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది…