ప్రభుత్వాసుపత్రి బాత్‌రూంలో దొరికిన మృత శిశువు వ్యవహారంలో పోలీసులు చిక్కుముడి విప్పారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని సేవా మందిరానికి చెందిన ఆటో చంద్ర, కమలమ్మకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇక పిల్లలు వద్దనుకుని ఏడాది క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు భర్తకు చెప్పింది. అయినప్పటికీ కొద్దిరోజుల్లోనే ఆమె గర్భం దాల్చింది. భర్త ఎక్కడ కోప్పడతాడోనని ఆందోళనకు గురైన కమలమ్మ గర్భవతి అయిన విషయాన్ని దాచి పెట్టింది.

ఎట్టకేలకు విషయం చంద్రకు తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని తేల్చి చెప్పాడు. ఆమె తెలిసిన అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. చివరికి నాటు వైద్యం సైతం తీసుకుంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకోగా బిడ్డకు అంగవైకల్యం ఉన్నట్లు తేలింది. నెలలు నిండటంతో ఆమెకు శనివారం కడుపునొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరింది. అప్పటికే గర్భస్రావం కోసం తీవ్రంగా మందులు వాడటంతో బాత్‌రూంకి వెళ్లిన ఆమెకు మృతశిశువు జన్మించింది. దీనికి భయపడిపోయిన కమలమ్మ బిడ్డను అక్కడే వదిలించుకుని వెళ్లిపోయింది.

అనంతరం బాత్‌రూంకి వెళ్లిన సిబ్బంది ఓ కవర్‌లో చుట్టిపెట్టిన మృతశిశువును గమనించి సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు సిబ్బందిని విచారించారు. ఈ క్రమంలో కమలమ్మ అనే మహిళ బాత్‌రూంకి వెళ్లి అరగంట తర్వాత రక్తపు మరకలున్న దుస్తులతో బయటకు వచ్చింది. సిబ్బంది దీనిపై ప్రశ్నించగా ఏదో చెప్పి అక్కడి నుంచి జారుకుంది. కమలమ్మ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను విచారించడంతో అసలు విషయాన్ని చెప్పింది. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి మృతశిశువును కమలమ్మకు అప్పగించారు.