హైదరాబాద్‌: సాయన్న మరణంతో ఖాళీ అయిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగే అవకాశాలు లేవు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేకపోవడమే దీనికి కారణం. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 151ఏ నిబంధన ప్రకారం: ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, చనిపోయిన/రాజీనామా చేసిన/అనర్హత వేటు పడిన సభ్యుడి పదవీ కాలం ఏడాదిలోపే ఉంటే ఈ నిబంధన వర్తించదు. శాసనసభ గడువు వచ్చే డిసెంబర్‌ 11తో ముగియనుంది. అంటే మరో 10 నెలలే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాలు తెలిపాయి.