రెవెన్యూ సిబ్బందిపై తెలంగాణాలో ఆగ్రహం పెల్లుబుకుతొంది ఇదో విచిత్రమైన పరిణామం . అబ్దుల్లాపూర్‌మెట్‌ లో మహిళా తహసీల్దార్‌ ను ఆమె కార్యాలయంలోనే ఒక రైతు సజీవదహనం చేసిన ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమయింది. అయితే రెవిన్యూ ఉద్యోగులపై ఎక్కడికక్కడ ప్రజలు నిరసన వ్యక్తంచేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి . వారి లంచగొండితనం , సమస్యల పరిష్కారంలో విపరీత జాప్యం, అవకతవకల ప్రభుత్వ విధానాలు, రాజకీయ , భూమాఫియా జోక్యం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ హత్యకు గురవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గుండాలలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో ఓ మహిళా రైతు అక్కడికి చేరుకొని రెవెన్యూ ఉద్యోగుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుపుస్తకాలకు సంబంధించి జాప్యంపై సిబ్బందిని నిలదీశారు. తన నుంచి లంచంగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆ రైతుకు సమాధానం చెప్పలేక రెవెన్యూ ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఓ రైతు , మరో యువకుడు అధికారులను ,పోలీసులను నేరుగా నిలదీశాడు. సర్టికేట్లు , పాస్ పుస్తకాలకు నెలల తరబడి తిరుగుతున్నా ఫలితంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాగే ఉంటె అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగినట్టు తాము పెట్రోల్ పోసుకొని , ఆఫీసుపై కూడా పోస్తామంటూ పోలీసులయెదుటే బెదిరించాడు. విసిగిపోయి తెగిస్తే అన్నంతపని చేస్తామని హెచ్చరించారు. ఈ రెండు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.