దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీ చేసిన సమన్లను సవాల్‌ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 11న ఒకసారి విచారించిన ఈడీ 16వ తేదీన మరోసారి హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును బుధవారం ఆమె తరఫు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు ప్రస్తావించి అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. కానీ సీజేఐ వెంటనే విచారణ చేపట్టడానికి నిరాకరిస్తూ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.

మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 నిబంధనలకు విరుద్ధంగా తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత ఆ పిటిషన్‌లో కోరారు. నిందితులపై ఈడీ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తోందని, తనను కూడా హింసించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై ఈడీ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని, ఈ నెల 11న తాను స్వచ్ఛందంగా ఫోన్‌ను అప్పగించినట్లు ఈడీ స్వాధీన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొందరి ప్రోద్బలం వల్లే ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిందని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషన్‌లో పేర్కొన్న ఇతర అంశాలు:

  • మహిళా రిజర్వేషన్ల కోసం దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా చేయబోతున్నట్లు నేను ఈ నెల 2న ప్రకటన చేయగా, ఈడీ 7వ తేదీన నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్‌ 50(2) (3) కింద నోటీసులు జారీచేసి 9వ తేదీన సాక్షిగా హాజరుకావాలని ఆదేశించింది. నాకున్న హక్కు ప్రకారం ఇంట్లో కానీ, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గానీ విచారించాలని చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11న విచారణకు హాజరయ్యాను.
  • విచారణ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఈడీ అందుకు కారణాలను మాత్రం చెప్పలేదు. స్వాధీన ఉత్తర్వుల్లో నేనే వారికి ఫోన్‌ను స్వచ్ఛందంగా అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అది అవాస్తవం. అరెస్టయిన నిందితులతో కలిపి నన్ను విచారించాల్సి ఉందని ఈడీ చెప్పినా ఆ రోజు నిందితులెవరినీ నా ముందుకు తీసుకురాలేదు. సూర్యాస్తమయం అయ్యాక కూడా రాత్రి 8.30 గంటల వరకు విచారణ కొనసాగించారు.
  • నాపై ఎలాంటి కేసూ లేదు. కొందరు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కస్టడీలో ఉన్న వారిని భయపెట్టి, బలవంతంగా వాంగ్మూలాలు తీసుకున్నారు. తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశమివ్వాలంటూ ఈనెల 10వ తేదీన అరుణ్‌ రామచంద్రపిళ్లై కోర్టును ఆశ్రయించడమే ఇందుకు ఉదాహరణ.
  • దర్యాప్తు సమయంలో ఈడీ తీవ్రమైన చర్యలకు పాల్పడుతోంది. థర్డ్‌డిగ్రీకీ దిగుతోంది. ఇ.చందన్‌రెడ్డి అనే వ్యక్తిని ఈడీ అధికారులు తీవ్రంగా కొట్టడం వల్ల ఆయన వినికిడి శక్తిని కోల్పోయారు.
  • ఇతర నిందితులు, సాక్షులకు ఎదురైన అనుభవాలను బట్టి చూస్తే ఈడీ నన్ను భౌతికంగా, మానసికంగా హింసించే ప్రమాదం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. అందువల్ల మళ్లీ ఈడీ ముందు హాజరైతే నాకు తీవ్ర హాని కలిగే ప్రమాదం ఉంది. విచారణ కోసం పిలిచిన వ్యక్తుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయడంతోపాటు సమీపంలో న్యాయవాది ఉండేలా అనుమతివ్వాలి. విచారణ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

నేడు మరోసారి ఈడీ ముందుకు:

ఎమ్మెల్సీ కవిత గురువారం మరోసారి దిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. ఆమెను ఈ నెల 11వ తేదీన సుమారు 8 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నెల 16వ తేదీన మరోసారి రావాలని అదేరోజు ఈడీ సమన్లు జారీచేసింది. ఆ సమన్లను రద్దు చేయాలని ఆమె బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ 24వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో ఆమె హాజరు అనివార్యమైంది.