ఓ యజమాని తన కుక్కను ఎందుకు వదిలించుకున్నాడో తెలిస్తే నవ్వాలో, ఏడవాలో అర్థంకాదు. ఆ కుక్క వేరే కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆయన కోపం నశాళానికి ఎక్కి దాన్ని ఇంట్లోంచి తరిమేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. స్థానికంగా ఉండే ఓ కూడలి వద్ద ఆ కుక్క అదేపనిగా మొరుగుతోంది. దాని అరుపులు విన్న కొందరు పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) అనే స్వఛ్చంద సంస్థకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్నారు వాళ్లు. దానికి ఏమైనా గాయాలయ్యాయా అని ఆ సంస్థ ప్రతినిధి దానిని పరిశీలించాడు. కానీ దానికి దెబ్బలు తగలలేవు. ఇంతలో దాని మెడలో కట్టి వుంచిన ఓ చీటీ వారి కంటపడింది. దాన్ని తీసి చదవాడాయన. దాన్ని చదవగానే ఆయన కళ్లు బైర్లు కమ్మినంత పనైంది. కాసేపటివరకు ఆ షాక్ నుంచి తేరుకోలేదాయన. ఆ చీటీని ఆ కుక్క యజమానే రాశాడు. అందులో ఏముందంటే

‘ఈ కుక్క అంటే నాకెంతో ఇష్టం. దీని వయసు మూడేళ్లు. ఇది ఎంతో మంచిది. ఎటువంటి రోగాలూ లేవు. ఇది మొరగడమే తప్ప ఇంత వరకు ఒక్కరిని కూడా కరవలేదు. రోజు పాలు, బిస్కట్లు, గుడ్లు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. అయితే అది రోడ్డు మీది తిరిగే ఒక వీధికుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది నాకు నచ్చలేదు. అందుకే దీన్ని వదిలించుకుంటున్నాను’ అని ఆ చీటీలో రాశాడు. చీటీ సాంతం చదివాక అతనికి నాలుక పెగలడానికి కొంత సమయం పట్టింది. బహుశా ఇది ప్రపంచంలోనే మొదటి కేసు అనుకుంటున్నానని తన ఆశ్చర్యం వ్యక్తం చేశాడాయన. కుక్కలను ఇలా కూడా వదిలించుకునేవారున్నారా? అని తననుతాను ప్రశ్నించుకున్నాడు. దాని సహజ లక్షణం అది ప్రదర్శించింది, అంతదానికే అది నిందితురాలు ఎలా అవుతుందని ఆ కుక్కను పీఎఫ్ఏ సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. అయినా వీడెక్కడి యజమాని కుక్క అంత పవిత్రంగా వుండాలని భావిస్తే దాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకోవాలని స్థానికులు అంటున్నారు.