మోఖామీద భూమి సరిగానే ఉన్నా పాస్‌పుస్తకాల్లో మాత్రం 1.16 ఎకరాలు మాయమయ్యాయి. రికార్డులు సవరించాలని ఎన్నిసార్లు వేడుకొన్నా రెవెన్యూ అధికారులు పట్టించు కోవడంలేదని మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామానికి చెందిన వేముల నిర్మల, రాకేశ్‌రెడ్డి వాపోయారు.

బాధితుల కథనం ప్రకారం: నడివాడ గ్రామంలో సర్వే నంబర్ 21లో వేముల రాకేశ్‌రెడ్డి 5.11 ఎకరాలు నూకల విష్ణువర్దన్‌రెడ్డి వద్ద కొన్నారు. 26వ సర్వే నంబర్‌లో రాకేశ్‌రెడ్డి భార్య నిర్మల 5.20 ఎకరాలు నూకల దేవమ్మ వద్ద 2012లో కొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా రాకేశ్‌రెడ్డికి చెందిన 21 సర్వే నంబర్‌లో పది గుంటలు, నిర్మలకు చెందిన 26 వ సర్వే నంబర్‌లో 1.06 ఎకరాలను తక్కువ నమోదుచేశారు. ఇద్దరి పేరిట మొత్తంగా 1.16 ఎకరాల భూమి రికార్డుల్లో తగ్గింది. ఈ విషయంలో మహబూబాబాద్ కలెక్టర్, తాసిల్దార్ కార్యాలయాల్లో ఎన్నిమార్లు దరఖాస్తు చేసుకున్నా అదిగో ఇదిగో అంటూ అధికారులు కాలయాపనచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.