సాధారణంగా చేప విలువ ఎంత ఉంటుంది ప్రాంతాన్ని బట్టి ఒక కిలోకి రూ. 300 నుంచి రూ. 600 ఉంటుంది. కొంచెం అరుదైన చేప అయితే రూ.1500 ఉంటుంది. కానీ జపాన్ లో ఒక చేప రేటు కేజీకి రూ.51000 పైగా ధర పలికింది. అంత రేటు పెట్టి కొనడానికి ఏంటి ఆ చేపలో ఉన్న ప్రత్యేకత అనుకుంటున్నారా. అయితే ఈ స్టోరీ తీసుకోవాలి మీరు. జపాన్ దేశ ప్రజలు చేపలను అమితంగా తింటారు, చేప మాంసంతో రకరకాల వంటలు చేసుకుని తింటుంటారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెస్టారెంట్ నిర్వాహకులు సైతం మంచి ఖరీదైన చేపలు తెచ్చి, రకరకాల వంటలు చేస్తుంటారు. అలా ఇటీవల ఒక రెస్టారెంట్ నిర్వాహకులు రూ.1 కోటీ 8 లక్షల విలువైన బ్లూ టూనా చేపను వేలంలో దక్కించుకున్నారు. చేపలంటే ఎంత ఇష్టముంటే మాత్రం ఇంత రేటు ఉంటుందా అంటూ ఆశ్చర్యపోకండి జపాన్ లో ప్రతిఏడూ కొత్త సంవత్సరం సందర్భంగా చేపలు వేలం వేస్తుంటారు. కొత్త సంవత్సరం నాడు చేపలు కొనుగోలుచేస్తే, బాగా కలిసొస్తుందని అక్కడి వారి నమ్మకం.

దీంతో ఎంత రేటున్నా సరే చేపలను కొనుక్కుని వెళ్తుంటారు. అలా 211 కేజీల బరువున్న ఈ బ్లూ టూనా చేపను వేలంలో అత్యధిక ధరకు చేజిక్కించుకుంది ఓ రెస్టారెంట్ సంస్థ. అయితే అంత రేటు పెట్టి కొని దానితో చేసిన వంటలను కస్టమర్లు అంత రేటు పెట్టి కొంటారా, అసలు ఆ రెస్టారెంట్ కు లాభాలు వస్తాయా అనే సందేహం కలుగుతుంది. అయితే ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే ఇది కేవలం మార్కెటింగ్, పబ్లిసిటీ కోసమే జరిగే ఒక తంతు. ఎంత ఎక్కువ రేటు పెట్టి కొంటే అంత పాపులారిటీ వస్తుందనీ, తద్వారా కస్టమర్లకు మరింత చేరువవొచ్చని రెస్టారెంట్ యాజమాన్యాలు భావిస్తాయి. దీంతో అరుదైన చేపలు ఎప్పుడు వేలానికి వచ్చినా రెస్టారెంట్ సంస్థలు, మాంసం విక్రయదారులు చురుకుగా వేలంలో పాల్గొంటారు. ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా జరిగిన వేలంలో ఒనెడెర హోటల్స్ గ్రూప్ కు చెందిన రెస్టారెంట్ ఈ బ్లూ టూనా చేపను రూ.1 కోటీ 8 లక్షలకు దక్కించుకుంది. ఇది అంతక్రితం 2019లో జరిగిన వేలం ధరకంటే చాలా తక్కువంట. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా వేలంలో పాల్గొనేవారి సంఖ్య తగ్గిపోవడంతో మార్కెట్ కూడా తగ్గిపోయిందని మార్కెట్ నిర్వాహకులు తెలిపారు.