కదులుతున్న వాహనంలో యువతిపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా గమ్యం చేరకు ముందే ఆమెను బయటకు నెట్టి వేసిన దారుణం మంగళవారం అర్థరాత్రి సమయంలో జరిగింది. బాధితురాలి భర్త ఫిర్యాదుపై ఈ నేరానికి సంబంధించి బుధవారం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. తూర్పు అగర్తలా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ముంతాజ్ హసీనా దాఖలైన కేసు వివరాలు చెప్పారు.

32 ఏళ్ల ఈ యువతి తన ఆరేళ్ల బాలికకు అస్వస్థతగా ఉండడంతో అగర్తలా మెడికల్ కాలేజిలో చేర్పించింది. ఆ బాలికను చూసి ఇంటికి తిరిగి వస్తుండగా రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆటో రిక్షా ఎక్కింది. ఆ ఆటో డ్రైవరు బాధితురాలికి పరిచయస్తుడే. అయితే ఆటో డ్రైవరు దారి మళ్లించి మరో దారిలో తీసుకెళ్తుండడంతో ఆమె ప్రతిఘటించింది. ప్యాసింజర్లు ఎక్కువ మంది ఉండే వేరే రూటులో తీసుకు వెళ్తున్నట్టు డ్రైవరు ఆమెకు సర్ది చెప్పాడు.

కొంత దూరం పోయాక దారిలో నలుగురు ప్యాసింజర్లు ఆటో ఎక్కారు. ఆమె నోటిని, చేతులను బంధించారు. బలవంతంగా ఆమెను తమ కారులో ఎక్కించుకుని 15 కిమీ దూరంలో ఉన్న నరసింగడ్‌కు తీసుకెళ్లారు. నరసింగడ్ వద్ద మరో నలుగురు రోడ్డు పక్కన అడవిలో కాచుకుని ఉన్నారు. కారులో వారు కూడా ఎక్కారు. మొత్తం మీద వీరంతా కలసి ఆ యువతిపై అత్యాచారం జరిపారు.

రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆ యువతిని కారు నుంచి ఇక్కడి సర్కూట్ హౌస్ సమీపాన రోడ్డు పైకి తోసివేశారు. కొంతమంది ఆమె పరిస్థితిని చూసి బుధవారం జిబి ఆస్పత్రిలో చేర్పించారు. బిజెపి ఎంపి ప్రతిమా బౌమిక్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. దర్యాప్తు వేగంగా సాగించి మిగతా నిందితులను అరెస్టు చేయాలని కోరారు.