పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామనుకున్నారు అయితే, వీరి ప్రేమకు, పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పారు, వాళ్లిద్దరూ వరుసకు ఏమవుతారో కూడా చెప్పారు. దీంతో ఆ ప్రేమ జంటకు షాక్‌ తగిలింది. ఇక, పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని తెలిసి, దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. రైలు పట్టాలపై తలలు పెట్టి ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన తెలంగాణలోని మక్తల్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు: కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు తాలూకాకు చెందిన ముని కుమార్‌, అనితల కుటుంబాలు తెలంగాణకు వలస వచ్చాయి. కృష్ణా మండలంలోని చేగుంట గ్రామ పరిసరాల్లో ఉంటూ గత కొన్ని నెలలుగా పత్తి తీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముని, అనితల మధ్య ప్రేమ చిగురించింది. గత కొద్దిరోజులుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు చెప్పి పెళ్లి కూడా చేసు​కోవాలనుకున్నారు. అయితే, వీరు చెప్పకుండానే ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. వీరి పెళ్లికి వారు అడ్డు చెప్పారు. అనిత మునికి అన్న వరసయ్యే వ్యక్తి కూతురని చెప్పారు.

అలా చూసుకుంటే అనిత, మునికి కూతురు అవుతుందని, ప్రేమ ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు. దీంతో ప్రేమికులిద్దరూ షాక్‌ తిన్నారు, ఇద్దరికీ విషయం అర్థమైంది తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించారు. విడిపోయి బతకటం కంటే చనిపోయి ఒక్కటవ్వటం మేలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. శనివారం చేగుంట రైల్వే ట్రాకు దగ్గరకు వచ్చారు. రైల్వే ట్రాకు మధ్యలో పక్కపక్కనే పడుకుని, ట్రాకుపై తలలు పెట్టారు. వేగంగా వచ్చిన రైలు వీరిపై నుంచి వెళ్లింది. తలలు శరీరాల నుంచి వేరుపడ్డాయి. ఆదివారం ఈ దృశ్యం చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..