విక్టరీ వెంకటేశ్‌, రానా దగ్గుబాటి కలిసి నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. ఈ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇప్పటికీ సిరీస్‌ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో ఇంటర్వ్యూకి హాజరైన ఆయన గతంలో తను ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చాడు. ‘కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ గురించి మాట్లాడే అతి తక్కువమందిలో నేను ఒకడిని. ఇదెలా మొదలైందంటే ఓ పిల్లవాడు తన తల్లికి కన్ను కనిపించడం లేదని ఎంతో బాధపడ్డాడు. అతడిని చూసి జాలేసింది. ప్రతిదానికి ఓ పరిష్కారం ఉంటుందని నచ్చజెప్పాను. అంతెందుకు, నాకు కూడా ఓ కన్ను కనిపించదని చెప్పాను. చాలామంది ఏదైనా శారీరక అనారోగ్యానికి గురైతే ఎంతో మనోవేదన చెందుతారు.

చివరికి వారు కోలుకున్నా సరే నాకు ఇలా జరిగిందేంటి? అని పదేపదే దాని గురించే ఆలోచిస్తారు. అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. నాకు కుడి కన్ను సరిగా కనిపించడం లేదని శస్త్రచికిత్స చేయించుకున్నా, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించుకున్నా. చెప్పాలంటే నేనొక టెర్మినేటర్‌ని (నవ్వుతూ). మరి ఇన్ని చేయించుకున్నా నేను బాగానే ఉన్నాను కదా మరి మీరెందుకు అక్కడే ఆగిపోతున్నారు? అనవసర ఆలోచనలు మానేసి హాయిగా ముందుకు వెళ్లండి’ అని చెప్పుకొచ్చాడు. కాగా రాగా 2016లో తన అనారోగ్య సమస్యల గురించి మొదటిసారి నోరు విప్పాడు. కుడి కన్ను ద్వారా సరిగా చూడలేకపోతున్నానని, పైగా కిడ్నీ కూడా పాడైందని చెప్పాడు. అయితే చికిత్స ద్వారా తాను పూర్తి స్థాయిలో కోలుకున్నానన్నాడు.