కోట్లరూపాయల అవినీతి కేసులో


ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిద్దిపేట అదనపు డీసీపీ గోవిందు నర్సింహారెడ్డి భారీగానే ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ సోదాల్లో బయటపడింది. మహబూబ్‌నగర్‌, జహీరాబాద్‌, అయ్యవారిపల్లె, సిద్దిపేట, హైదరాబాద్‌లో నర్సింహారెడ్డి ఆయన బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు చేసిన అనిశా అధికారులు రూ.10 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు.

ఆయన నివాసంలో కిలోన్నర బంగారం, 5.33 లక్షల నగదు, బ్యాంకులో మరో 6.37 లక్షలు ఉన్నట్లు తేలింది. దీంతో పాటు గోల్కొండ సమీపంలో ఖరీదైన విల్లా, శంకర్‌పల్లి, గొల్లపల్లి, జహీరాబాద్‌ ప్రాంతాల్లో 14 ఇంటి ప్లాట్‌లు, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో 20 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఈ సోదాల్లో గుర్తించారు. ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల సోదాల అనంతరం నర్సింహారెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.