కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన కొత్త మోటారు వాహన చట్టం ఈ నెల (సెప్టెంబర్ 1, 2019) నుంచి అమలులోకి వచ్చింది. దీని ద్వారా భారీ ట్రాఫిక్ ఫైన్ లు విధిస్తున్నారు. ఫైన్ లు భారీగా విధిస్తుండడంపై దేశవ్యప్తంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ లో ఓ వ్యక్తి ట్రాఫిక్ నిబంధనల అతిక్రమించి భారీ చలాన్‌ కు బలయ్యాడు. దీంతో తన బైక్ ను ట్రాఫిక్ పోలీసు ముందే పెట్రోల్ లీక్ చేసి తగలబెట్టాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఢిల్లీలో గురువారం రాకేష్ అనే వ్యక్తి బైక్ పై డ్రింక్ చేసి వెళ్లుండగా ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపి లైసెన్సు, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ తదితర పేపర్లు చూపించమని అడిగారు. అతని దగ్గర అవేమి లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు అతనికి జరిమానా విధించారు. బైక్ ధర కంటే పోలీసులు అతడికి విధించిన జరిమానానే ఎక్కువగా ఉండడంతో షాక్ అయిన అతను తన బైక్ పెట్రోల్ పైపును లీక్ చేసి అక్కడే తగలబెట్టుకున్నాడు. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అర్పేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోయింది.