తెరుచుకుని ఉన్న పిన్నీసును మింగిన చిన్నారికి ఉస్మానియా వైద్యులు అరుదైన చికిత్స చేశారు. గొంతులో ఇరుక్కుపోయిన పిన్నీసును తీసి ప్రాణాలు కాపాడారు. కొండన్నగూడ గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, అనూష దంపతులకు 8 నెలల బాలుడు ఉన్నాడు. ఆ చిన్నారి ఆదివారం ఇంట్లో ఆడుకుంటూ పిన్నీసు మింగేశాడు. బాలుడు అవస్థ పడుతుండడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అతడి గొంతులో పిన్నీసు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు నిలోఫర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. అనూష తన కుమారుడిని తీసుకొని నిలోఫర్‌కు తీసుకురాగా, అడ్మిట్‌ చేసుకున్న వైద్యులు తిరిగి అక్కడినుంచి ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాలుడిని ఉస్మానియాకు తీసుకెళ్లగా, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ రమేష్‌ ఎండోస్కోిపీ చికిత్స ద్వారా 15 నిమిషాల్లో చిన్నారి గొంతులో తెరుచుకుని ఉన్న పిన్నీసును బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. నెలల వయస్సు గల పిల్లలకు ఎండోస్కోపీ ద్వారా చికిత్స అందించడం అత్యంత అరుదని డాక్టర్‌ రమేష్‌ తెలిపారు.