తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు కసరత్తు ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఒక కేబినెట్‌ నోట్‌ ఇప్పటికే ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వం పంపినట్లు తెలసింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలతో పాటు జమ్మూకాశ్మీర్‌,సిక్కింలలో కూడా శాసనసభ సీట్లను పెంచాలన్నది కేంద్ర నిర్ణయం. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, సాధ్యమైనంత త్వరగా పని పూర్తిచేసేలా కమిషన్‌కు నిర్ధేశించాలని భావిస్తోంది.ఎన్నికల కమిషన్‌కు పంపిన నోట్‌లో ఈ విధివిధానాలకు సంబంధించిన అంశాలనే పేర్కొన్నట్లు తెలిసింది. రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు రానుందని భావిస్తున్నారు. ఈ లోగా కమిషన్‌ కూడా పని ప్రారంభిస్తుందని చెబుతున్నారు. కేంద్ర న్యాయ, హోంశాఖలు ఇప్పటికే గ్రీన్‌ సిగల్‌ ఇచ్చి ఉండటం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉండటంతో సీట్ల పెంపు ప్రక్రియ వేగంగా జరుగుతుందని భావిస్తున్నారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంద్రప్రదేశ్‌లో 225, తెలంగాణలో 151కి శాసనసభ సీట్లు పెరగాల్సి ఉంది