యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బుధవారం (మార్చి 1) జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని కలెక్టర్‌ పమేలా సత్పతి ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో అవతారంలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకుంటున్నాయి. నారసింహుడుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మార్చి 3వ తేదీన యాదాద్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి నారసింహుని తిరుకల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారికి ప్రభుత్వం తరపున పలువురు మంత్రులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాగా తిరుకల్యాణం నేపథ్యంలో బ్రహ్మోత్సవ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం దేదీప్యంగా అలరారుతూ దర్శనమిచ్చింది. నారసింహుని తిరు కల్యాణ వైభవాన్ని కనులారా దర్శించేందుకుగానూ భక్తజన సందోహం భారీగా తరలివచ్చింది. ఆలయంలోని బ్రహ్మోత్సవ శోభను చూసి భక్తులు పులకించి పోయారు. యాదగిరీశుడి నవ్యప్రాంగణం శోభాయమానంగా దర్శనమిస్తోంది. ఇక విద్యుత్ కాంతుల్లో యాదాద్రి ఆలయం దగదగ మెరిసిపోతుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో నిర్వహించే నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, బాలభోగం, అభిషేకం, అర్చనలను నిలివేశారు.