భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు అరెస్టు విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్​లో కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. అంతేకాదు పాల్వంచ పోలీస్​ స్టేషన్​కు తీసుకువచ్చి, అదే పోలీస్​ స్టేషన్​లో 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనే ప్రచారం జరిగింది. కానీ గురువారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు మరో ప్రకటన చేశారు. అసలు వనమా రాఘవ తమకు దొరకలేదని, ఆయన కోసం 8 ప్రత్యేక పోలీస్​ బృందాలు గాలిస్తున్నాయని, పక్క రాష్ట్రాల్లో కూడా గాలింపు చేస్తున్నామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌ రాజ్‌ ప్రకటించారు.

అదుపులోకి తీసుకుంది ఎవరు..?

వనమా రాఘవను హైదరాబాద్​లోని ఓ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో అప్పటి వరకు అరెస్ట్​ చేయాలన్న ప్రతిపక్షాలు ఆయనపై చర్య తీసుకోవాలంటూ డిమాండ్​ చేశాయి. అయితే రాత్రి పాల్వంచ పోలీసులు చేసిన ప్రకటనతో అసలు రాఘవ ఎక్కడున్నారనేది తేలడం లేదు. రాఘవను అదుపులోకి తీసుకున్నప్పుడు ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయంటూ మరో ప్రచారం కూడా ఉంది. ఒకవేళ అదుపులోకి తీసుకుంటే, వారు ఎవరు అనేది సందేహంగా మారింది. ప్రస్తుతం రాఘవ అరెస్ట్​ విషయంలో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. సామాజికవేత్తలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నిజంగానే పోలీసులు అరెస్ట్​ చేస్తే దాచి పెట్టాల్సిన అవసరం లేదు. రాఘవను అరెస్ట్​ చేసినట్లు బహిరంగంగానే ప్రకటన చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పోలీసుల ప్రకటనతో కొత్త ట్విస్ట్​ ముందుకొచ్చింది.

మేం అరెస్ట్​ చేయలేదు: ఏసీపీ రోహిత్​ రాజు

వనమా రాఘవను తాము అదుపులోకి తీసుకోలేదని పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు గురువారం రాత్రి ప్రకటించారు. రాఘవను అరెస్టు చేయలేదని, ఆయన కోసం ఏపీ, తెలంగాణలో పోలీసు బృందాలు గాలిస్తున్నాయని స్పష్టం చేశారు. రాఘవను తప్పనిసరిగా పట్టుకుని అరెస్టు చేస్తామని, ఒకవేళ రాఘవ తమకు దొరకకుండా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తే తాము కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఏసీపీ రోహిత్ రాజు ప్రకటించారు.