భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో తీవ్ర సంచలనం కలిగించిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో విస్తుపోయే విషయం బయటికొచ్చింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకుని తన నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. వనమా రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో ఎంత అడిగినా ఇచ్చేవాడిని. కానీ ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. పిల్లలు లేకుండా నా భార్యను హైదరాబాద్‌‌కు ఒంటరిగా తీసుకురావాలని కోరారు. నీ భార్యను నా దగ్గరికి పంపిస్తే నువ్వు అడిగిన పని చేసి పెడతా.. లేకపోతే ఒక్కడు కూడా నీకు సాయం చేసేందుకు ముందుకు రాడని బెదిరించాడు.

రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు’’ అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఈ వీడియో తాజాగా బయటికి రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్యపై సోమవారం తెల్లవారుజామున పెట్రోల్‌ పోసి తానూ నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా 80శాతం గాయాలతో తీవ్రంగా గాయపడిన సాహితి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే వనమా రాఘవ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

G